వేసవి సెలవుల కారణంగా విశేషంగా విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం మరో రెండు లగేజి కౌంటర్లు ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని టిటిడి
కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో గురువారం టిటిడి సీనియర్ అధికారులతో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో వివిధ విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లగేజి డిపాజిట్, కలెక్షన్ సెంటర్లను పెంచడం ద్వారా భక్తుల సమయాన్ని ఆదా చేయవచ్చన్నారు. కాటేజి డోనార్
మేనేజ్‌మెంట్ సిస్టమ్ అప్లికేషన్‌ను విజయవంతంగా అమలుచేస్తున్న టిటిడి ఐటి విభాగాన్ని, టిసిఎస్ అధికారులను ఈవో అభినందించారు. ఉదయాస్తమాన సేవ భక్తులకు కూడా ఇలాంటి అప్లికేషన్‌ను రూపొందించాలని సూచించారు. తిరుమలలోని
కల్యాణకట్టలో వినియోగించిన బ్లేడ్లను సాధారణ చెత్తతో, ఆసుపత్రి వ్యర్థాలతో కలపకుండా చూడాలని, వాడేసిన బ్లేడ్ల తొలగింపునకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని టిటిడి ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్టను, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా|| నర్మదను ఈవో ఆదేశించారు. సర్వదర్శనం భక్తులు వేచి ఉండేందుకు నిర్మిస్తున్న కాంప్లెక్స్‌కు మెరుగైన మోడల్‌తో ముందుకు రావాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి,
ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, ఎస్‌ఇలు శ్రీ సుధాకరరావు, శ్రీ వేంకటేశ్వర్లు,
శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివోలు శ్రీ
రవీంద్రారెడ్డి, శ్రీమతి విమలకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.